మహారాష్ట్ర, 13 నవంబర్ (హి.స.)
దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన
పోరాటంలో బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మహారాష్ట్రలోని లాతూర్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కాంగ్రెస్ నాయకులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. కానీ దీనికి విరుద్ధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉన్నాయని, స్వాతంత్ర్య ఉద్యమం దేశ ఐక్యతకు వారు ఎటువంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన కుల గణననకు కట్టుబడి ఉందని, ఈ ప్రక్రియ ప్రజలను విభజించడం కోసం కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వాన్ని దొంగల ప్రభుత్వంగా అభివర్ణించారు. ద్రోహులకు గుణపాఠం చెప్పేందుకు అసెంబ్లీ ఎన్నికలు ఒక అవకాశం అని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో రోజూ ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..