తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి షిండేతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తిన పర్యటనలో హైకమాండ్ పెద్దలను కలుస్తున్నారు. గురువారం ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను షిండే కలిశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షిండే తొలి ఢిల్లీ పర్యటన ఇదే. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఢిల్లీలో పర్యటించినా.. షిండే మాత్రం హస్తినకు వెళ్లలేదు. తాజాగా కుటుంబంతో కలిపి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడి.. మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధానమంత్రిని కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ విజయానికి చేసిన కృషిపై ప్రధాని మోడీ అభినందించినట్లు తెలిపారు. ఫడ్నవిస్, అజిత్ పవార్తో కలిసి రాష్ట్రాభివృద్ధికి వ్యూహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్