హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
• బీహార్‌లో రూ. 12,100 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి మరియు జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అనగా నవంబర్ 13, 2024న రిమోట్ వీడియో లింక్ ద్వారా కాచిగూడ రైల్వే స్టేషన్‌తో సహ దేశవ్యాప్తంగా 18 ప్రదేశాలలో ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభిoచారు. ఈ సంధర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కూడా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్; హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎమ్.ఏ.రెహ్మాన్ మరియు ప్రధాన కార్యాలయం మరియు హైదరాబాద్ డివిజన్ నుండి ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈరోజు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్‌లోని దర్భంగాలో దాదాపు రూ 12,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో ఆరోగ్యం, రైలు, రోడ్డు, పెట్రోలియం మరియు సహజ వాయువు రంగాలు ఉన్నాయి.
ఈ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రజల సంక్షేమం మరియు దేశ సేవ పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, రోడ్డు, రైలు మరియు గ్యాస్ మౌలిక సదుపాయాలతో కూడిన సుమారు రూ.12,000 కోట్ల విలువైన నేటి అభివృద్ధి పథకాలను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అతి తక్కువ ధరలకు మందులను అందించే జన్ ఔషధి కేంద్రాలను కూడా ఆయన ప్రస్తావించారు.
ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలను వివరిస్తూ దృష్టి సారించవలసిన ప్రాధాన్యత అంశాలలో వ్యాధుల నుండి నివారణ మొదటిదని ; అనారోగ్యం యొక్క సరైన నిర్ధారణ రెండవదని; ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స మరియు ఔషధాల లభ్యత మూడవదని ; చిన్న పట్టణాలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం నాల్గవదని మరియు ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క విస్తరణ ఐదవదని తెలియజేశారు
హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్ మాట్లాడుతూ గౌరవ ప్రధాన మంత్రి కాచిగూడ స్టేషన్‌తో పాటు 18 ప్రదేశాలలో జనౌషధి కేంద్రాలను ప్రారంభించడం ఒక చారిత్రాత్మక సందర్భమని అన్నారు. రైల్వే స్టేషన్‌లలో సౌకర్యాలు మరియు సదుపాయాలను స్థిరంగా పునరాభివృద్ది చేయడం ద్వారా ప్రజల విభిన్న అవసరాలను తీర్చేందుకు భారతీయ రైల్వే కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. జనౌషధి కేంద్రాలు సరసమైన ధరలకు మందులను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలలో ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని మరియు రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు మరియు సందర్శకులు జనౌషధి ఉత్పత్తులను సులభంగా లభించడానికి వీలు కల్పిస్తాయని ఆయన చెప్పారు.
ప్రతి రోజూ సుమారు 47,000 మంది ప్రయాణికులు రాకపోకలతో దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటి. ప్రజల సౌకర్యార్థం దాదాపు 100 రైళ్లు ఈ స్టేషన్ నుండి ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తాయి. కాచిగూడ స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించబడిన ఈ జనౌషధి కేంద్రం సరసమైన ధరలకు నాణ్యమైన మందులను కొనుగోలు చేయడంలో ప్రజలతో పాటు వేలాది మంది ప్రయాణికులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు