హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయలేకనే బడ్జెట్ను ఆలస్యం చేశారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరన్నారు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 6.46 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. వాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయన్నారు. 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చంద్రబాబు రాష్ట్రం అప్పులపై అసత్యాలు చెప్పటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. కాగ్ రిపోర్టుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు