విజయవాడ, 9 నవంబర్ (హి.స.) విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఆ శాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించి, పటిష్ఠంగా అమలుచేస్తామన్నారు. 6, 7, 8 తరగతుల్లో కలిపి మొత్తం 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. టీచర్ల నియామకాలకు, పదోన్నతులకు ఒకే విద్యార్హత ఉండేలా చూడాలని సంఘాలు కోరగా సానుకూలంగా స్పందించారు. జీవో 117కు ప్రత్యామ్నాయంపై నెలాఖరుకు తుది నిర్ణయానికి వస్తామని, దానిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు. బదిలీలపై కేటగిరీలను ముందుగానే ప్రకటిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు, డీఎస్సీ కూడా పూర్తి చేస్తామన్నారు. హైస్కూల్ ప్లస్‌లో టీచర్ల కొరత ఉంటే సర్దుబాటు చేస్తామన్నారు. రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ కార్యక్రమాలు రద్దుచేయాలని సంఘాలు కోరగా, దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల