హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిన మావోయిస్టులు ఆదివారం తెల్లవారు జామును ఎవరు ఊహించని విధంగా.. పామేడ్ పోలీస్ క్యాంప్ 2 పై మెరుపు దాడులు చేశారు. పోలీసులే టార్గెట్ గా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పులతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం భీకరంగా మారింది. అయితే మావోయిస్టుల కాల్పుల నుంచి తేరుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకుల మోత మోగుతుంది. తెల్లవారుజాము నుంచి.. మావోయిస్టులు-పోలీసుల బలగాల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం గురించిన పూర్తి సమాచారం అందలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్