అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.), : ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాదేవరపల్లిల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధు (తాడిమళ్ల)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల