తెలంగాణ/ఏ.పీ, 15 జనవరి (హి.స.)
శ్రీశైలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కనుమ రోజైన నేడు శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి పుణ్యదంపతుల దర్శనం కోసం క్యూలైన్ల, కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నది.
భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేశారు. అదేవిధంగా రద్దీ దృష్ట్యా భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మల్లికార్జునుడిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..