తెలంగాణ/ఏ.పీ, 13 జనవరి (హి.స.) మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కళ్యాణ్ బోర్డు తాజాగా చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రాహ్మణ వర్గంలో రోజురోజుకూ జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని బ్రాహ్మణ జంటలకు పరశురామ్ కళ్యాణ్ బోర్డు పిలుపునిచ్చింది. ఎవరైతే బ్రాహ్మణ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనిస్తారో వారికి లక్ష రూపాయలు నజరానా ఇస్తామని ఆ బోర్డు తాజాగా ప్రకటించింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. అందరం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామని.. ప్రస్తుత కాలంలో చాలా మంది యువత ఒకరే సంతానంతో పిల్లలు కనడం ఆపేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా సమస్యగా మారుతోందని వాపోయారు. భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉందని.. అందుకే ప్రతీ జంటకు కనీసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నట్లు పండిత్ విష్ణు రాజోరియా తెలిపారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు పరశురామ్ కళ్యాణ్ బోర్డు తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..