హైదరాబాద్, 2 జనవరి (హి.స.)
బంగ్లాదేశ్ టెర్రరిస్టులు బెంగాల్లో చొరబడేందుకు బీఎస్ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్) ప్రోత్సహిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం పరిపాలనా విభాగంతో ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ఇది కేంద్రం దుశ్చర్య అని మమతా ఆరోపించారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ బలగాలు మహిళలను సైతం హింసిస్తున్నాయని ఆమె ఆరోపించారు. తీవ్రవాదులు బెంగాల్లోకి చొరబడి హత్యలు చేసి దర్జాగా తిరిగి వెళ్తున్నారన్నారు. బీఎస్ఎఫ్ సరిహద్దు గుండా తీవ్రవాద మూకల చొరబాట్లను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్రం హస్తం ఉందని మమతా ఆరోపించారు. తమ రాష్ట్రంలో టెర్రరిస్టుల చొరబాటుకు చూస్తూ ఊరుకునేది లేదని ఆమె తేల్చిచెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సరిహద్దు మన చేతుల్లో లేదు.. చొరబాట్లను టీఎంసీ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తే సహించేది లేదన్నారు. చొరబాట్లను కట్టడి చేయాల్సిన బాధ్యత బీఎస్ఎఫ్ పై ఉంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..