తిరువనంతపురం:, 21 జనవరి (హి.స.) ప్రియుడిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతికి కేరళలోని కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం ఈ కేసును విచారించిన నెయ్యట్టింకర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మ(24)ను దోషిగా తేలుస్తూ ఉరిశిక్ష వేసింది. హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న కారణంతో యువతి మామ నిర్మలాకుమారన్ నాయర్‌కు సైతం మూడేళ్ల జైలు శిక్షను విధించింది. మహిళ చర్యలు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపాయని, ప్రేమకు ఉన్న పవిత్రతను తగ్గించాయని కోర్టు పేర్కొంది. గతంలో తనపై ఎటువంటి కేసులు లేనందున విద్యార్హతలు, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె కారణాలతో శిక్షను తగ్గించాలని ఈ సందర్భంగా గ్రీష్మ కోర్టును అభ్యర్థించింది. నేరం తీవ్రత కారణంగా ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆర్మీకి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడంతో ప్రియుడు రాజ్‌తో సంబంధం తెంచుకునేందుకు గ్రీష్మ యత్నించింది. ఇందుకు అంగీకరించకపోవడంతో రాజ్ అడ్డు తొలగించుకునేందుకు యువతి ప్రణాళిక వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు