దిల్లీ: , 4 ఫిబ్రవరి (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన రెండు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. రెండు రోజుల పారిస్ పర్యటనను ముగించుకుని అటు నుంచి అటే మోదీ అమెరికాకు వెళ్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోదీ.. 13వ తేదీన ట్రంప్‌తో భేటీ అవుతారని సమాచారం. అయితే మోదీ పర్యటనపై అధికారికంగా సమాచారం లేదు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ వెళ్లనున్నారు. 11వ తేదీ వరకూ ఆయన అక్కడ ఉంటారు. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు