తెలంగాణ, 8 జనవరి (హి.స.) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరిపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపైనే కాకుండా.. ప్రియాంకపైనా అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ కామెంట్స్ పై పార్టీ అధినేత జేపీ నడ్డా బిధూరిని మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు కమలం పార్టీ నేతలు చెప్తున్నారు.
ఇక, ఈ అంశంపై బీజేపీలో రెండుసార్లు చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే, రమేశ్ బిధూరి పోటీ చేస్తున్న స్థానం నుంచి తప్పించడం లేదా మరో చోటుకి మార్చడంపై కమలం పార్టీ నజర్ పెట్టినట్లు టాక్. ఇటీవల ప్రకటించిన బీజేపీ తొలి జాబితాలో కళ్కాజీ నియోజకవర్గం నుంచి బిధూరి పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే స్థానం నుంచి ఆప్ తరపున ఢిల్లీ సీఎం అతిశీ పోటీ చేస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిణామాలతో ఆ స్థానంలో ఆయనను తప్పించి ఓ మహిళా నేతను పోటీలో ఉంచాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీ టాక్ వినిపిస్తుంది. ఈ అంశంపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో పోటీ చేసే బలమైన మహిళా నేత కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..