ఢిల్లీ, 17 అక్టోబర్ (హి.స.) బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో, ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో నితీశ్ కుమార్ నాయకత్వంలోనే కూటమి పోటీ చేస్తుందని స్పష్టం చేసిన ఆయన, ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పి రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించారు.
బీహార్‌లోని అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తాయని, పార్టీల మధ్య మనస్పర్థలు వచ్చాయని మీడియాలో వస్తున్న వార్తలపై అమిత్ షా స్పందించారు. అవన్నీ నిరాధారమైన కథనాలని, వాటిలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అన్ని మిత్రపక్షాలు ఐక్యంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అమిత్ షా మాట్లాడుతూ, “నితీశ్ కుమార్ సీఎం అవుతారా? లేదా? అని నిర్ణయించేది నేను కాదు. ప్రస్తుతానికి ఆయన నాయకత్వంలోనే మేము ఎన్నికలకు వెళుతున్నాం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ, దాని మిత్రపక్షాలన్నీ కలిసి కూర్చొని తమ నాయకుడిని ఎన్నుకుంటాయి” అని వివరించారు. ఈ వ్యాఖ్యలతో సీఎం అభ్యర్థిపై ఒకరకమైన సస్పెన్స్‌ను కొనసాగించారు.
2020 ఎన్నికల నాటి పరిస్థితులను ఆయన గుర్తుచేశారు. “గత ఎన్నికల్లో జేడీయూ కన్నా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో నితీశ్ కుమార్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి, బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని ప్రతిపాదించారు. కానీ, మేము మిత్రపక్షానికి, సీనియారిటీకి ఎప్పుడూ గౌరవం ఇస్తాం. అందుకే నితీశ్‌ను సీఎం చేశాం” అని అమిత్ షా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV