ఉపరాష్ట్రపతి ఇంటికి బాంబు బెదిరింపు.. ఆసక్తికర విషయం ఏమిటంటే..!
చెన్నై, 17 అక్టోబర్ (హి.స.) భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం శుక్రవారం చెన్నైలో తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, క్షుణ్ణంగా తనిఖీ చేసిన అన
ఉపరాష్ట్రపతి ఇంటికి బాంబు బెదిరింపు.. ఆసక్తికర విషయం ఏమిటంటే..!


చెన్నై, 17 అక్టోబర్ (హి.స.) భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం శుక్రవారం చెన్నైలో తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఈ బెదిరింపు కేవలం ఉత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే... చెన్నైలోని ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌కు ఈ రోజు ఒక ఈమెయిల్ వచ్చింది. నగరంలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్‌లో ఉంది. ఈ హెచ్చరికను ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. వెంటనే సీనియర్ పోలీసు అధికారులు, బాంబ్ డిటెక్షన్ నిపుణులు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి హుటాహుటిన రంగంలోకి దిగారు.

అయితే, విచారణలో ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన బెదిరింపు వచ్చిన మైలాపూర్‌లోని ఇంటిని దాదాపు ఏడాది క్రితమే ఖాళీ చేసినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అత్యంత కీలకమైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఒక అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

వీఐపీ భద్రతా నిబంధనల ప్రకారం, అధికారులు ఆయన ప్రస్తుత నివాసమైన పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు. అయితే, వారు వెళ్లేసరికి ఆ అపార్ట్‌మెంట్‌కు తాళం వేసి ఉండటంతో లోపల తనిఖీలు చేయడానికి వీలుపడలేదు. పరిసర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత, ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో చెన్నైలోని ప్రముఖులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నకిలీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జులై నుంచి ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 150కి పైగా పాఠశాలలకు, పలు ఆసుపత్రులకు కూడా ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ రావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ మెయిల్స్ ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి పంపినట్లు గుర్తించారు. ఈ ఘటనల వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ యూనిట్లు దర్యాప్తు ముమ్మరం చేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande