అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)
అమరావతి: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన నిర్వర్తిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్) వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే శ్రీరామ్ నాతో చెప్పారు. అప్పటినుంచి పార్టీ పట్ల అంకితభావంతో, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ తెలంగాణ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుడైన ఆయన సాఫ్ట్‌వేర్ సంస్థల యజమానిగా ఉన్నారు. శ్రీరామ్ తాళ్ళూరికి ఉన్న సంస్థాగత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశాం’’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ