అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)
ఉరవకొండ: దసరా పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం చెందిన ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఉరవకొండలోని పాతపేటకు చెందిన సుంకన్న(40), భార్య కల్పన, కుమార్తె భవాని, కుమారుడు సన్నీతో కలిసి ద్విచక్ర వాహనంపై వజ్రకరూరు మండలం కడమలకుంటలోని సుంకులమ్మ ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్యాపిలి వద్ద గుర్తుతెలియని వాహనం.. వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుంకన్న(40), సన్నీ(8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కల్పన, భవానీని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. పండగపూట చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ