కార్తిక మాసంలో నదీస్నానం ఎందుకు చేయాలి? అసలు రహస్యం ఏంటి?
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.)పరమ పవిత్రమైన కార్తిక మాసంలోకి ప్రవేశించాం. హరిహరులను ప్రీతికరమైన ఈ కార్తిక మాసంలో నదీస్నానం, ఉపవాసం, దానం, జపం, వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే వీటన్నింటిలో నదీస్నానికే మహర్షులు, ఋషులు పెద్ద పీట వేశారు. అసలు కార్
కార్తిక మాసంలో నదీస్నానం ఎందుకు చేయాలి? అసలు రహస్యం ఏంటి?


అమరావతి, 24 అక్టోబర్ (హి.స.)పరమ పవిత్రమైన కార్తిక మాసంలోకి ప్రవేశించాం. హరిహరులను ప్రీతికరమైన ఈ కార్తిక మాసంలో నదీస్నానం, ఉపవాసం, దానం, జపం, వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే వీటన్నింటిలో నదీస్నానికే మహర్షులు, ఋషులు పెద్ద పీట వేశారు. అసలు కార్తిక మాసంలోనే నదీస్నానం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్నది కేవలం ఆధ్యాత్మిక కారణాలేనా? ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయా! ఈ కథనంలో తెలుసుకుందాం.

పరమ పవిత్రమైన కార్తిక మాసం ప్రారంభమయింది. ఈ మాసంలో నదీస్నానం తప్పకుండా చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక వేత్తలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మన పెద్దలు ఏర్పరచిన ప్రతి నియమం వెనుక ఓ శాస్త్రీయ కోణం తప్పకుండా ఉంటుంది. అయితే కార్తిక మాసంలో చేసే నదీస్నానానికి ఇటు ఆధ్యాత్మికంగా, అటు శాస్త్రీయంగా కూడా ఎన్నో కారణాలున్నాయి. స్కంద పురాణం ప్రకారం కార్తిక మాసంలో సూర్యుడు ఉదయించక ముందు, నక్షత్రాలు కనిపిస్తుండగానే నది, చెరువు వంటి పవిత్ర జలాల్లో స్నానం చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని నమ్మకం. సూర్యోదయానికి పూర్వమే నదిలో స్నానం చేయడం అత్యంత ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

పురాణ ప్రాశస్త్యం

కార్తిక పురాణంలో కూడా నదీస్నానం మహత్యాన్ని గురించిన వివరణ ఉంది. ఎన్నో పాపాలు చేసినవారు, వ్యసనాలకు లోబడినవారు, తల్లిదండ్రులను బాధ పెట్టినవారు, చివరకు చేసిన పాపాలకు పిశాచ జన్మ ఎత్తినవారు కూడా కార్తిక మాసంలో నదీ స్నానంతో తరించిన కథలెన్నో మనకు కార్తిక పురాణంలో కనిపిస్తాయి.

దామోదర మాసం

కార్తిక మాసానికి దామోదర మాసం అని కూడా పేరు. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు అత్యధిక ఫలితం ఇస్తాయని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తిక మాసంలో చేసే నదీ స్నానాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని శాస్త్ర వచనం.

ఆకాశగంగ

పవిత్ర కార్తిక మాసంలో ఆకాశ గంగ అన్ని నదుల్లోకి తటాకాల్లోకి, చెరువుల్లోకి ఎక్కడ శుభ్రమైన నీరు ఉంటే అక్కడ ప్రవేశిస్తుంది . పైగా ఈ మాసంలో వర్షాల వల్ల నదులు, చెరువులు, కుంటలు, ఏళ్ళు సెలయేర్లు నిండుగా పారుతుంటాయి. ఎన్నో వనమూలికలు, పారుతున్న నీళ్లతో పాటుగా ప్రవహించి, నదుల్లోని నీరు అమృతతుల్యంగా మారుతాయి. నదీ జలాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి . అందుకే కార్తిక మాసంలో చేసే నదీ స్నానాలు మన ఆరోగ్యాన్ని మాత్రమే గాక మంచి ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగించి మనలో సాత్వికతను పెంపొందిస్తుంది.

కార్తిక స్నానం ఎలా చేయాలి?

కార్తిక స్నానం నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, సముద్రంలో కానీ చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది. అయితే ఇది వీలుకాని వారి కోసం శాస్త్రం కొంత వెసులుబాటును కల్పించింది. అసలు కార్తిక స్నానం ఎలా చేస్తే ఏ ఫలితం ఉంటుందో చూద్దాం.

బ్రాహ్మీ ముహూర్తంలో గృహ స్నానం

కార్తిక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో మన ఇంటిలో నిలువ ఉన్న చన్నీళ్లతో చేసే పుణ్య స్నానం ఆరు సంవత్సరాలపాటు పుణ్య నదుల్లో చేసిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది.

బావినీటి స్నానం

కార్తిక మాసంలో మన ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఉన్న నీటితో బ్రహ్మ ముహూర్తాన స్నానం చేస్తే పన్నెండేళ్ళు పుణ్య నదీ నదాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది.

సరస్సు చెరువుల్లో స్నానం

కార్తిక మాసంలో మనం నివసించే ఊరులో ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు పుణ్య నదీ స్నానాలు ఆచరించిన పుణ్యం కలుగుతుంది.

నదీస్నానం

కార్తిక మాసంలో మనకు దగ్గరలో ఉన్న నదిలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే తొంబై ఆరేళ్ళ పాటు పుణ్య నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది.

పవిత్ర నదీస్నానం

కార్తిక మాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే 9600 ఏళ్ళ పాటు పుణ్య నదీస్నానం ఆచరించిన ఫలితం కలుగుతుంది.

సంగమ స్నానం

కార్తిక మాసంలో పవిత్ర నదీ సంగమాల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే 38400 ఏళ్ళ పాటు పవిత్ర నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది.

జీవనదులు స్నానం

కార్తిక మాసంలో పవిత్ర జీవనదులైన గంగా , యమునా, సరస్వతి , కృష్ణ , గోదావరి , కావేరి వంటి పుణ్య నదుల్లో బ్రహ్మ ముహూర్తములో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే మూడు కోట్ల సంవత్సరాలు పుణ్య నదీస్నాన ఫలితాన్ని అందజేస్తుంది అని శాస్త్ర వచనం.

ప్రయాగ సంగమ స్నానం

కార్తిక మాసములో త్రివేణీ సంగమం, ప్రయాగలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే గంగాది పుణ్య నదుల్లో చేసిన పుణ్య ఫలితానికి వంద శాతం అధికం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

సముద్ర స్నానం

కార్తిక మాసంలో సకల నదులు కలిసే సముద్రములో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే వీటన్నింటి కంటే అమిత ఫలితం కలుగుతుందని శాస్త్ర వచనం.

ఎన్ని సార్లు నదీస్నానం చేయాలి?

కార్తిక మాసంలో పూర్తి మాసమంతా పుణ్య స్నానాలు చేసి అనుష్ఠానం చేయలేని వారు కనీసం మాసం చివరి రోజులో అయినా పుణ్య స్నానాలు ఆచరించి అనుష్టానము చేస్తే కూడా అంత్య పుష్కరాలలో పుష్కర స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అది వీలుకానివారు ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో నదీస్నానం చేస్తే మాసమంతా స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తిక మాసంలో నదుల్లో కాని సముద్రంలో కాని స్నానం చేయడానికి వీలు కాని వారు సూర్యోదయానికి ముందు తమ తమ గృహాలలోనే స్నాన సంధ్యాదులు చేసి అనుష్ఠానం చేసినా నదీ స్నానం చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం.

శాస్త్రీయ కారణాలు

కార్తిక మాసంలో నదీస్నానం చేయడంలో ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా శాస్త్రీయత కూడా ఉంది. కార్తిక మాసం వచ్చేసరికి దాదాపుగా వర్షాకాలం పూర్తవుతుంది. నదులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటాయి. ప్రవాహాల్లో ఉధృతి కూడా తగ్గుతుంది. వరదల్లో కొట్టుకువచ్చిన చెత్త చెదారం నీటి అడుగున చేరుకొని నదులన్నీ నిర్మలమైన నీటితో నిండి ఉంటాయి. నది ప్రవహించే సమయంలో తనతో పాటు విలువైన మూలికలను, ఖనిజాలను మోసుకుని ముందుకు సాగడంతో నదీజలాలకు అమృతత్వం చేకూరుతుంది. అందుకే నదీజల్లాలో ఔషధీ గుణాలు అధికంగా ఉండే ఈ సమయంలో నదీస్నానం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది.

కౌముది మాసం

ఆశ్వయుజ కార్తిక మాసాలలో చంద్రుని కిరణాలు భూమికి దగ్గరగా ఉంటాయి. ఈ కిరణాలు నదుల్లోని జలాల్లో ఉండే ఔషధీ మూలికలు ప్రభావవంతం చేస్తాయి. అందుకే కార్తిక మాసంలో నదీ జలాల్లో ఔషధీ తత్వం అధికంగా ఉంటుంది. రాత్రంతా చంద్రుని కిరణాలతో ఔషధీ తత్వం సంతరించుకున్న నదీ జలాల్లో సూర్యోదయానికి ముందు స్నానం చేయడం వలన అనేక మొండి రోగాలు నశించి పోతాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇదే కార్తిక స్నానంలో ఇమిడి ఉన్న శాస్త్రీయ కోణం. ఇటు ఆధ్యాత్మికంగా చూసినా, అటు శాస్త్రీయంగా చూసినా కార్తిక మాసంలో నదీస్నానం చేయడం శ్రేయస్కరం. మనం కూడా ఈ కార్తిక మాసంలో నదీ స్నానం ఆచరిద్దాం. ఇటు చక్కని ఆరోగ్యంతో పాటు అటు మోక్షాన్ని కూడా పొందుదాం. ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande