
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.):
జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..
వందేమాతరం గేయం 150వ(Vande Mataram) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రత్యేక నాణెం, స్మారక తపాలాబిళ్ల(Commemorative Stamp)ను విడుదల చేశారు. దీంతోపాటు జాతీయ గేయానికి సంబంధించి '150.ఇన్(150.in)' అనే ఓ స్పెషల్ పోర్టల్‌నూ ఆయన ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం(Indira Gandhi Indoor Stadium)లో నిర్వహించిన వందేమాతరం సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. 'వందేమాతరం' అనే పదం మన వర్తమానంలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుందని, తద్వారా మనం సాధించలేని లక్ష్యమంటూ ఏదీలేదనే ధైర్యాన్నిస్తుందని చెప్పారు. ఫలితంగా కోట్లాది మంది భారతీయుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఉద్ఘాటించారు. మోదీకి మద్దతుగా సమాజంలోని అన్నివర్గాల పౌరులు బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు