
ఢిల్లీ 14,డిసెంబర్ (హి.స.) రాయ్‌పుర్: వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో రూ.92 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ చర్యల ద్వారా నక్సలైట్ల ఆర్థిక మూలాలను దెబ్బతీశామంది. వారి సమాచార నెట్‌వర్క్‌లపై కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో ‘అర్బన్ నక్సలైట్ల’పై మానసికంగా తీవ్ర ప్రభావం చూపగలిగామని ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం...జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రూ.40 కోట్లు, రాష్ట్ర అధికారులు రూ.40 కోట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేశాయి. 2014లో 126 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా...2025 నాటికి కేవలం 11 జిల్లాలే మిగిలాయి. ఈ ఏడాది సుమారు 317 మంది నక్సలైట్లు అంతమయ్యారు. 862 మంది అరెస్టు కాగా మరో 1,973 మంది తుపాకులను వదిలి లొంగిపోయారు. 2014 వరకు కేవలం 66గా ఉన్న పటిష్ఠ పోలీస్‌స్టేషన్‌ల సంఖ్య పదేళ్లల్లో 586కు పెరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ