
ఢిల్లీ 14,డిసెంబర్ (హి.స.) భారత (India) దిగుమతులపై ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన భారత్.. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తమ ఎగుమతిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే హక్కు ఉందని భారత అధికారి తెలిపినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి (Mexico Tariffs).
చైనా, భారత్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాతో సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై సుంకాలను పెంచే విషయంపై మెక్సికో సెప్టెంబరులోనే సెనెట్‌లో ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచే ఆ దేశంతో భారత్ చర్చలు జరుపుతుందని ఒక అధికారి తెలిపారు. అక్కడి భారత రాయబార కార్యాలయం సెప్టెంబరు 30నే ఆర్థిక మంత్రిత్వశాఖ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తిందని వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన సుంకాల నుంచి భారత ఎగుమతులకు ప్రత్యేక రాయితీలను కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ