
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ నగరానికి తాగునీటిని
అందించే కీలకమైన గండిపేట జలాశయం లోకి అక్రమంగా మురుగు నీటిని (Septic waste) విడిచిపెడుతున్న ముఠాపై జలమండలి అధికారులు చర్యలకు ఉపక్రమించారు. హిమాయత్ నగర్ గ్రామం వద్ద సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మురుగు నీటిని రిజర్వాయర్ లోకి వదులుతున్నట్లు స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుతో జలమండలి పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో TG11 T1833 నంబరు గల ట్యాంకర్ జలాశయంలోకి వ్యర్థాలను పంపిస్తున్నట్లు గుర్తించి, డ్రైవర్ రామావత్ శివ నాయక్, దీనికి కారణమైన నిరంజన్ అనే వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిందితులు పట్టుబడకుండా ఉండేందుకు ట్యాంకర్పై అనధికారికంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూయరేజ్ బోర్డ్ (HMWSSB) లోగోను ముద్రించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ వాహనం జలమండలిలో నమోదు కాలేదని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించేలా ఈ చర్య ఉందంటూ డీజీఎం నరహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 17న జరిగిన ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తీసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు