ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి.పై విజిలెన్స్ విచారణ
విజయవాడ, 14 మార్చి (హి.స.):ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లోగా విజిలెన్స్‌ విచారణను పూర్తిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ
ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి.పై విజిలెన్స్ విచారణ


విజయవాడ, 14 మార్చి (హి.స.):ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లోగా విజిలెన్స్‌ విచారణను పూర్తిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్‌, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఏయూలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. ‘మాకు అందిన సమాచారం ప్రకారం.. రూసా నిధుల దుర్వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన రూ.25లక్షలను ఖర్చుచేసే విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందింది. అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించారని మా దృష్టికి వచ్చింది. మాజీ సీఎం జగన్‌ విశాఖపట్నం వెళితే ఆయనకు స్వాగతం పలికేందుకు తరగతులు నిలిపివేసి విద్యార్థులను రోడ్లపై నిలిపారు. ఏయూ రిజిస్ట్రార్‌ సహా అనేక అక్రమ నియామకాలు చేశారు. దూరవిద్య పరీక్షల నిర్వహణలో ప్రైవేటు కళాశాలల నుంచి లంచాలు తీసుకోవడం, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించివైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం వంటి తీవ్రమైన అభియోగాలు మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై వచ్చాయి. దీనిపై ఇన్‌చార్జి వీసీ ఒక కమిటీని నియమించి అవకతవకలపై నివేదిక కోరారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు 60 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందించాలని విజిలెన్స్‌ను ఆదేశిస్తాం. ఆ నివేదిక వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయాలంటే భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏయూలో విద్యనభ్యసించిన ఎందరో ప్రముఖులు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులుగా రాణించారు. ఏయూలో చదివిన వ్యక్తి ఈరోజు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామంది ఏయూలో చదువుకుని ఈ స్థాయికి వచ్చారు. నన్ను విద్యాశాఖ మంత్రిగా నియమించేటప్పుడు ఈ ఐదేళ్లలో ఒక్క ప్రభుత్వ వర్సిటీ అయినా టాప్‌-100 ర్యాంకింగ్‌లో ఉండాలని సీఎం చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande