ముంబై, 18 మార్చి (హి.స.)అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. భారత్‌పైనా సుంకాల విధింపు ఉంటుందని హెచ్చరించారు.
ఈ క్రమంలో వాణిజ్య యుద్ధానికి దారి తీసి ప్రపంచ ఆర్థిక అనిశ్చితులకు దారి తీసింది. అలాగే అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయనే ఆందోళనలు నెలకొన్న క్రమంలో పెట్టుబడిదారులు సురక్షిత మార్గమైన బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవలే ఔన్స్ బంగారం ధర రికార్డ్ గరిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గినా ఇవాళ మళ్లీ 3000 డాలర్లు దాటింది. దీంతో దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పెరుగుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గడం గమనార్హం. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు.
మార్చి 18వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.100 తగ్గడంతో రూ.82 వేల 100 వద్దకు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.110 మేర తగ్గడంతో రూ.89 వేల 560 వద్దకు దిగివచ్చింది.
స్వల్పంగా తగ్గిన వెండి రేటు..
బంగారంతో పాటుగా వెండి రేటు సైతం తగ్గింది. వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి రేటు ఇవాళ తగ్గడం ఊరటగానే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.100 తగ్గి రూ.1,11,900 వద్దకు దిగివచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి