
హైదరాబాద్, 15 మార్చి (హి.స.)
మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని
మెటా ప్లాట్ఫామ్స్, తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఏకంగా 20 శాతం అంటే సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించే దిశగా ప్రణాళికలు వేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. గతంలో 2022-23లో జరిగిన 'ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ' కంటే ఇది చాలా పెద్దదిగా ఉండబోతోంది. ప్రస్తుతం మెటాలో సుమారు 79,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా నివేదికల ప్రకారం దాదాపు 16,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఏఐ మౌలిక సదుపాయాల (Data Centers, Al Chips) కోసం కంపెనీ దాదాపు 600 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించుకోవడంతో, ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ లే ఆఫ్స్కు ప్రధాన కారణం 'ఏఐ అసిస్టెడ్ వర్కర్స్' అని జుకర్బర్గ్ సూచనప్రాయంగా తెలిపారు. గతంలో పెద్ద బృందాలు కలిసి చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో ఒకే టాలెంటెడ్ వ్యక్తి పూర్తి చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మిడిల్ మేనేజ్మెంట్, రియాలిటీ ల్యాబ్స్ (Metaverse), ఏఐ ప్రాధాన్యత లేని విభాగాలు ఈ లే ఆఫ్స్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, మెటా తన సొంత ఏఐ మోడల్ 'Avocado' ను అభివృద్ధి చేయడానికి వందల మిలియన్ల డాలర్ల ప్యాకేజీలతో కొత్త నిపుణులను తీసుకుంటుండటం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..