దంతేవాడ: , 31 మార్చి (హి.స.)ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనాస్థలంలో ఓ మహిళా నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
మృతురాలిని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రేణుక అలియాస్, ఛైతి అలియాస్ సరస్వతిగా గుర్తించారు. ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు