దిల్లీ, 3 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది.
ఈ కుంభకోణంపై గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.
4
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు