దిల్లీ: 9 జూలై (హి.స.) రుతుపవనాల ఆగమనంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వారణాసిలోని ఘాట్‌లు నీట మునిగిపోయాయి. అయోధ్యలో సరయూ నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు నది లోపలికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాము సూచించిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు.
ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో మంగళవారం సాయంత్రం వరకు 413.52 మి.మీ. వర్షపాతం నమోదైంది. జులై 11వ తేదీ వరకు మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కోల్‌కతా సహా పశ్చిమబెంగాల్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ బెంగాల్‌లోని ఐదు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అస్సాం, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ