దిల్లీ:,10 ఆగస్టు (హి.స.)కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రాకు ఆర్థిక నేరం కేసులో ఉచ్చు బిగుస్తోంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ వివాదాస్పద ల్యాండ్ డీల్ (Corrupt land deal in Gurugram) ద్వారా వాద్రా (Robert Vadra)కు రూ.58 కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, దీనిపై విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేస్తూ వాద్రాకు నోటీసులు జారీ చేసింది.
రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థ గురుగ్రామ్‌లోని షికోహ్‌పూర్‌లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని రూ. 7.50 కోట్లకు కొన్నట్లు సేల్ డీడ్‌లో చూపించారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరా రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. పైగా చెక్కు ద్వారా చెల్లింపులు జరిపినట్టు పత్రాలు చూపించారు. అయితే వాద్రా చెక్కు అసలు ఇప్పటివరకు ఎన్‌క్యాష్ కాలేదు. దీంతో ఆ భూమి మొత్తాన్ని వాద్రా సంస్థకు ఉచితంగా ఇచ్చేశారని ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తం లావాదేవీని ఒక లంచంగా ఈడీ భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ