అమరావతి, 26 ఆగస్టు (హి.స.)
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ వార్తతో రవితేజ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.
ఈ సినిమా వాయిదాకు గల కారణాలను చిత్రబృందం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. పరిశ్రమలో జరుగుతున్న సమ్మెలు, మరికొన్ని ఊహించని కారణాల వల్ల సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదు. అందుకే 'మాస్ జాతర' విడుదలను వాయిదా వేస్తున్నాం అని మేకర్స్ తెలిపారు. సినిమా ఆలస్యమైనప్పటికీ, ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. పనులన్నీ పూర్తయ్యాక, భారీ స్థాయిలో థియేటర్లలోకి సినిమాను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఒక రైల్వే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి