విషాదంలో కోలీవుడ్.. ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూత
చెన్నై, 19 సెప్టెంబర్ (హి.స.)తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, విలక్షణ నటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస
విషాదంలో కోలీవుడ్.. ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూత


చెన్నై, 19 సెప్టెంబర్ (హి.స.)తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, విలక్షణ నటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోబో శంకర్‌కు ఇటీవల పచ్చకామెర్లు సోకాయి. దీంతో ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. గురువారం ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. ఇంద్రజ కూడా ‘బిగిల్’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు.

స్టాండప్ కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శంకర్, ‘కలక్క పావతు యారు’ అనే టెలివిజన్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోబోలా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంతో ఆయనకు ‘రోబో శంకర్’ అనే పేరు స్థిరపడింది. ‘మారి’, ‘విశ్వాసం’ వంటి అనేక చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ‘సొట్టా సొట్టా ననైయుతూ’ ఆయన నటించిన చివరి చిత్రం.

రోబో శంకర్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande