
హైదరాబాద్, 21 జనవరి (హి.స.)*
జిల్లాల తొలగింపు, కాంగ్రెస్ హమీల మోసం మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రం
ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి సన్నద్ధం: కేటీఆర్
గ్రీన్‌కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా అని ప్రశ్న
దావోస్ లో గ్రీన్ కోతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? లోపల లోపల డీల్స్ మాట్లాడుకుంటున్నారా?
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు ప్రజలు అనుమతి ఇచ్చినట్లేనని, ఈ అంశాన్ని ప్రజలు స్పష్టంగా గుర్తించి రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికే జిల్లాలు ఎత్తేస్తారన్న భయం నెలకొందని, ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాల్టీల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించనున్నామని, ఉమ్మడి జిల్లాలకు చెందిన వారినే బాధ్యతల్లో పెడతామని కేటీఆర్ తెలిపారు. రేపు లేదా ఎల్లుండి ఇన్‌చార్జ్‌లను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని, ఎన్నికలకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఎన్నికల కోసం అవసరమైన ప్రచార మెటీరియల్ అంతా సిద్ధంగా ఉందని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక చేయాలని నేతలకు సూచించామని తెలిపారు. సర్వేలు కూడా చేయిస్తున్నామని, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచ్ స్థానాలు గెలవడం సామాన్యమైన విషయం కాదని కేటీఆర్ అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని తాము అనుకోవడం లేదని, అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ అత్యంత సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే ‘బస్తీ బాట’ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన పనులు, ప్రస్తుత సమస్యలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు.
జిల్లాలు తొలగిస్తారన్న ఆందోళన కొత్త జిల్లాల్లో తీవ్రంగా ఉందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు అనుమతి ఇచ్చినట్లేనని ప్రజలకు వివరించనున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏమి చేసినా అది ఆయన ఇష్టమని, తమ పని తాము చేసుకుంటామని అన్నారు.
సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగినా సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చాయో ప్రజలందరూ చూశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్‌కే ఓటు వేయమని చెబుతున్న పరిస్థితి ఉందని అన్నారు. తమ ఇన్‌చార్జ్‌లను ఇప్పటికే నియమించామని, పార్టీ తన పనిలో తాను నిమగ్నమై ఉందని స్పష్టం చేశారు.
లేని ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీఎం జవాబు ఇవ్వాలని అన్నారు. చాలా చోట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, కొత్త జిల్లాలు చేసిన పట్టణాల్లో జిల్లాలు ఎత్తేస్తారన్న భావన ప్రజల్లో బలంగా ఉందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి నిర్ణయాలు స్థానిక నాయకులే తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల కోఆర్డినేటర్లను నియమిస్తున్నామని, టికెట్లు ఎవరికి ఇవ్వాలన్నది వారే నిర్ణయిస్తారని చెప్పారు. ఎన్నికలు లేని నాయకులు, ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తామని వెల్లడించారు. లోకల్ ఎన్నికలు కావడంతో స్థానికులే ప్రచారం చేస్తారని, స్థానిక సమస్యలనే ఎజెండాగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
*దావోస్ లో గ్రీన్ కోతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? లోపల లోపల డీల్స్ మాట్లాడుకుంటున్నారా?*
‘ఫార్ములా–ఈ’ విషయంలో గ్రీన్‌కోకు లబ్ధి చేకూర్చామంటూ ఆరోపణలు చేస్తున్నారని, అయితే అదే గ్రీన్‌కోతో దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేటీఆర్ విమర్శించారు. గ్రీన్‌కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. దావోస్‌లో ఏపీ బీజేపీ ఎంపీ సహా పలువురితో మంత్రులు చర్చలు జరుపుతున్నారని, ఇది ఏ విషయానికి సంకేతమని నిలదీశారు. ఒకవైపు ‘ఫార్ములా–ఈ’ కుంభకోణం అంటారని, ఆధారాలు చూపాలని, మరోవైపు అదే అంశంపై విచారణ అంటూనే దావోస్‌లో గ్రీన్‌కోతో చర్చలు జరుపుతారని విమర్శించారు. ఒకచోట మంచోళ్లుగా, మరోచోట చెడ్డోళ్లుగా ఎలా వ్యవహరిస్తారని నిలదీశారు. దావోస్ లో గ్రీన్ కోతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? లోపల లోపల డీల్స్ మాట్లాడుకుంటున్నారా? లేకపోతే నీ మీద కేసులో నుంచి తీసేస్తాను డబ్బులు ఇయ్యి అని బెదిరిస్తున్నారా? ఏం చేస్తున్నావు అక్కడ? చెప్పండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచి విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, సింగరేణిపై మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జిని వేయించి, సింగరేణి మీద మీరు ఎప్పటి నుంచి చేస్తామంటే అప్పటి నుంచి విచారణ చేయండి మాకు అభ్యంతరం లేదన్నారు. 2014 నుంచి విచారణ చేయండి. కాకపోతే 'విజిట్ సైటేషన్ సర్టిఫికేట్' అనే పనికిమాలిన నిబంధన ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండేదని, తాము ఏమీ మార్చలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, సమాధానం చెప్పేవరకు ఆయన వెంబడి పడతామని అన్నారు. రేవంత్‌లో ‘రాము’ ఉన్నాడు, ‘రెమో’ ఉన్నాడని వ్యాఖ్యానిస్తూ, ఒకవైపు సినిమా టికెట్లు పెంచమని చెబుతూనే మరోవైపు టికెట్లు పెంచుతూ జీఓలు ఇస్తారని విమర్శించారు. సర్వాయి పాపన్న పేరుతో జనగామ జిల్లా చేస్తామని చెప్పి, ఇప్పుడు అదే జిల్లాను తొలగిస్తామని అనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు