
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. 2026 ఉగాది కానుకగా ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ 3.0’ పథకాల కింద ప్రభుత్వం మూడో విడత ఆర్థిక సాయంను నేడు విడుదల చేయనుంది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.2,676 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,874 కోట్లు ఉండటం విశేషం.
ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3.0 పథకాల కింద రైతులకు రెండు విడతలుగా రూ.14,000 అందించారు. ఈరోజు జమ చేయనున్న రూ.6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి ఇచ్చే రూ.20,000 ఆర్థిక సాయం పూర్తవుతుంది. రైతుల ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత మద్దతు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో నిర్వహించే కార్యక్రమం నుంచి సీఎం రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు సాయంత్రం 4.20 గంటలకు సూరంపల్లికి చేరుకోనున్నారు. అనంతరం 4.25 నుంచి 4.55 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్