
అమరావతి , 13 అక్టోబర్ ( హి.స.)ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని కోరుతూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర పోలీసుల పనితీరుపై తమకు నమ్మకం లేదని, వారు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ పార్టీ ముఖ్య నేతలు ఏపీ హైకోర్టులో రెండు వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.
అధికార కూటమి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికలు సజావుగా సాగాలంటే రాష్ట్ర పోలీసు విభాగం జోక్యం లేకుండా ఎన్నికల పర్యవేక్షణ కొనసాగాలని పిటిషన్లో ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీసుల స్థానంలో కేంద్ర పారామిలిటరీ బలగాలను పూర్తిస్థాయిలో మోహరించి, వారి భద్రతా పర్యవేక్షణలోనే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు.
దీంతో పాటు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి రిగ్గింగ్, అవకతవకలు జరగకుండా నిరోధించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల పాటు నిరంతరాయంగా సీసీటీవీ నిఘా, ప్రత్యక్ష వెబ్కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు జరిగే అవకాశమున్నందున వారికి తగిన రక్షణ, పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV