
న్యూఢిల్లీ, 14 అక్టోబర్ (హెచ్ఐఎస్): భారత రాజ్యాంగ బద్ధ వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రతికూల ప్రజా చర్చలు, కుట్రపూరిత ప్రచారాలపై హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విస్తృత వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం, అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు), భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం మరియు పార్లమెంట్ వంటి కీలక వ్యవస్థలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరగడం తీవ్ర ఆందోళనకర అంశమని వారు పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన వారిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన న్యాయవాదులు, విధాన నిర్ణేతలు (పాలిసీ మేకర్లు), సివిల్ సర్వెంట్లు, శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తలు ఉన్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ లా స్కూల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ సహా పలు విభాగాలకు చెందిన 44 మందికి పైగా ప్రముఖులు ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. సరైన అనుమతి లేకుండా ఏదైనా ఒక రాజకీయ ప్రచారానికి విశ్వసనీయత తెచ్చేందుకు 'హార్వర్డ్ విశ్వవిద్యాలయం' పేరును వాడుకోవడంపై కూడా వారు ప్రశ్నలు గుప్పించారు.
ఆ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: “ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశపు బాధ్యతాయుత పౌరులుగా అత్యంత బాధ్యతాయుత భావనతో మేము ఈ లేఖ రాస్తున్నాం. ఇటువంటి క్లిష్ట సమయంలో మౌనంగా ఉండటం నిర్లక్ష్యానికి సాకు కాజాలదు. భారత్ను బందీగా చేశారని, రాజ్యాంగ బద్ధ అధికారులను 'దొంగలు' అని లేదా 'ప్రభావితమయ్యే వ్యక్తులు' అని చిత్రీకరించడానికి ఉపయోగిస్తున్న భాష.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమేనన్న తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.”
శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం చట్టబద్ధ దర్యాప్తు సంస్థలు తీసుకునే చర్యలపై నిష్పాక్షిక సమీక్ష జరగాల్సిందేనని, అయితే సాక్ష్యాధారాలు, చట్టబద్ధమైన ప్రక్రియ లేదా వ్యవస్థాగత జవాబుదారీతనానికి బదులుగా విస్తృతమైన ఆరోపణలు, అవమానకరమైన భాషను ఉపయోగించడం సరైంది కాదని ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజా సేవకులు మరియు వారు నిర్వహించే పదవుల గౌరవాన్ని కాపాడటం కూడా అంతే అవసరమని పేర్కొన్నారు.
ఏ పరిస్థితిలోనైనా రాజ్యాంగం, చట్టబద్ధ పాలన మరియు పౌర స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల కట్టుబాటు అనేది స్వార్థ ప్రయోజనాల కంటే రాజ్యాంగానికి, ఎంపిక చేసుకున్న ఆగ్రహం కంటే న్యాయానికి, ఆరోపణల రాజకీయం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవానికి ప్రాధాన్యతనిచ్చేలా ఉండాలని ఉద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi