శ్రీశైలంలో నవరాత్రి వేడుకలు: మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికా దేవి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికా అమ్మవారు 'మహాగౌరి' దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
Temple


హైదరాబాద్ , 18 అక్టోబర్ (హి.స.)ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికా అమ్మవారు 'మహాగౌరి' దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శాంతి, శుభం, మంగళకరమైన సమృద్ధికి సంకేతమైన మహాగౌరి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు.

అమ్మవారి మహాగౌరి అలంకారాన్ని పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, నవగ్రహ హోమాలు మరియు చండీయాగాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, శోభాయమానమైన దివ్యమైన పుష్పాలంకరణతో భాసిల్లిన అమ్మవారి స్వరూపాన్ని చూసి భక్తజనం మైమరిచిపోయారు.

సాయంత్రం వేళ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణియైన భ్రమరాంబికా అమ్మవారితో పాటు శ్రీ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో కన్నులపండువగా వాహన సేవ నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణలతో శ్రీశైల గిరి వీధులు మార్మోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande