వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రులు.. మహాదుర్గగా భక్తులకు దర్శనం
చారిత్రక నగరమైన వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత నేత్రపర్వంగా, వైభవంగా సాగుతున్నాయి.
Temple


హైదరాబాద్ , 18 అక్టోబర్ (హి.స.)చారిత్రక నగరమైన వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత నేత్రపర్వంగా, వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు 'మహాదుర్గ' అలంకారంలో అభయప్రదానం చేశారు. దుష్టశిక్షణ, శిక్షణ రక్షణే ధ్యేయంగా శక్తిస్వరూపిణిగా విరాజిల్లుతున్న మహాదుర్గ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున భద్రకాళి ఆలయానికి తరలివచ్చారు.

మహాదుర్గ దేవి అలంకారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన అరుదైన పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహాదుర్గ రూపంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు.

ఈ పవిత్ర వేడుకలను తిలకించేందుకు భక్తులు బారులు తీరి జై భద్రకాళి.. జై జై భద్రకాళి అంటూ భక్తిశ్రద్ధలతో నినాదాలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ మరియు కమిటీ సభ్యులు క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పర్యవేక్షించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande