
అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అనూహ్య ఆధిక్యత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి, ప్రతిపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో ఏకంగా 6 మున్సిపాలిటీలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అధికార పార్టీ వ్యూహాత్మక అడుగులు, క్షేత్రస్థాయిలో బలమైన పట్టు కారణంగా ఈ స్థానాలు ప్రత్యర్థులు లేకుండానే అధికారికంగా అధికార పార్టీ ఖాతాలో చేరాయి.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. నిర్ణీత గడువులోగా ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో, సంబంధిత మున్సిపాలిటీలలో టీడీపీ అభ్య్రర్థులు విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరించారు. ఏకగ్రీవమైన మున్సిపాలిటీలలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వం విజయం సాధించిన అభ్యర్థులకు, స్థానిక నాయకులకు అభినందనలు తెలిపింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు చూపిన చొరవ ఈ అపూర్వ విజయానికి కారణమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే మిగిలిన స్థానాల్లో కూడా ఇదే జోరును కొనసాగించి ఘన విజయం సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
పోటీ నిలిచిన ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు పార్టీ వ్యూహాలు రచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ఈ ఏకగ్రీవాలు అధికార పార్టీకి నైతిక స్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు రాజకీయంగా బలమైన సంకేతాలను పంపాయి. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్