
అమరావతి , 23 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) అత్యవసరంగా సమావేశమైంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడం మరియు యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం కాగితాలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం కాకుండా, గతంలో సంతకాలు చేసిన ప్రాజెక్ట్లు క్షేత్రస్థాయిలో త్వరగా ఉత్పత్తి దశకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన హబ్గా మార్చేందుకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను (Ecosystem) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, పారిశ్రామిక వాడలలో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తగిన కార్యాచరణ రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్