
అనకాపల్లి , 23 అక్టోబర్ (హి.స.)అనకాపల్లి జిల్లాలోని అరబిందో పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఏ మేరకు కొనసాగుతున్నాయి? అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని హోంమంత్రి అధికారులకు సూచించారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, ఘటనకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం తనకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రమాద తీవ్రత, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
పరిశ్రమలో అగ్నిప్రమాదం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి నొక్కిచెప్పారు. ఘటనకు గల కారణాలను గుర్తించడం, ప్రమాద ప్రాంతంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్