పూసపాటిరేగ జెడ్పీటీసీ ఎన్నికల్లో వివాదం: వైసీపీ అభ్యర్థి బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు
జిల్లాలోని పూసపాటిరేగ మండల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్య నామినేషన్పై జన
Janasena


పూసపాటిరేగ , 24 అక్టోబర్ (హి.స.)

పూసపాటిరేగ మండల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్య నామినేషన్పై జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైతన్య అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తూ కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన అభ్యర్థి కోట్ల రేవతి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా దాఖలైన ఈ నామినేషన్ను తిరస్కరించాలని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని రేవతి డిమాండ్ చేశారు.

ఈ ఫిర్యాదులో జనసేన నేతలు అనేక సాంకేతిక, చట్టపరమైన అంశాలను లేవనెత్తారు. బొత్స చైతన్యకు పూసపాటిరేగ మండల పరిధిలో స్థానికంగా ఓటు హక్కు లేదని కోట్ల రేవతి స్పష్టం చేశారు. ఆమెకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ వార్డులోనే ఓటు హక్కు ఉందంటూ అందుకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారికి అందజేశారు. 'UJK1667229' నంబరు గల ఓటర్ ఐడీ కార్డుతో చైతన్యకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఓటు హక్కు నమోదై ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.

అక్టోబర్ 22వ తేదీ వరకు విజయనగరం కార్పొరేషన్లోని 41వ వార్డు పరిధిలో ఓటరుగా ఉన్న వ్యక్తి, గ్రామీణ ప్రాంతమైన పూసపాటిరేగ మండలానికి వచ్చి జెడ్పీటీసీ స్థానానికి ఎలా నామినేషన్ వేస్తారని జనసేన అభ్యర్థి కోట్ల రేవతి ఘాటుగా ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులకు సంబంధించిన ఓటు హక్కు స్థానిక పరిధిలోనే ఉండాలని, కానీ ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఓటును గ్రామీణ ప్రాంతానికి మార్చుకునే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని రేవతి కోరారు. ఈ అక్రమ నామినేషన్పై నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే విచారణ జరిపి చట్టాన్ని అమలు చేయాలని ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వేడుకున్నారు. ఈ వివాదంపై ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande