వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన – సహాయక చర్యల సమీక్ష
'ఆర్నాబ్' తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
Chandrababu


అమరావతి , 29 అక్టోబర్ (హి.స.)

'ఆర్నాబ్' తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. భూముల ముంపు పరిస్థితిని, పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు పునరావ క్యాంపుల్లో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను ఆయన సమీక్షిస్తున్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు ప్రాంతానికి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో నీట మునిగిన వరి పంటలు, వ్యవసాయ పొలాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో ఈ విమాన సర్వే కొనసాగుతోంది.

వట్లపాలెంలో నష్టపోయిన రైతులను నేరుగా కలిసి పంట నష్టంపై వివరాలు సేకరించనున్నారు. గచకాయలపోర పునరావస శిబిరాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలు, సహాయక సామగ్రిని పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.

తుఫాను నష్టాలపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామని, కేంద్ర సహాయం కోరుతూ లేఖ రాశామని సీఎం తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామన్నారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతో పాటు లీటరు నూనె, కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి వ్యక్తికి రూ. 1,000 ఆర్థిక సాయం అందజేస్తామని, తుఫాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande