
అమరావతి , 29 అక్టోబర్ (హి.స.)
తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోపాలపురంలోని కుమ్మరికుంట కాలనీలో దుస్తులు ఆరేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరికుంట కాలనీకి చెందిన పెంటబోయిన పెద్ద బంగారయ్య (57), అప్పల నరసమ్మ (53) ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నరసమ్మకు విద్యుత్ తీగలు తగలడంతో ఆమె విద్యుత్ షాక్కు గురైంది. భార్య ప్రమాదంలో చిక్కుకోవడాన్ని గమనించిన బంగారయ్య ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆమెను కాపాడే క్రమంలో ఆయన కూడా విద్యుత్ షాక్కు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఒకరిని కాపాడబోయి మరొకరు కూడా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.
విద్యుత్ తీగల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్