
రామగుండం, 29 అక్టోబర్ (హి.స.)
మాదకద్రవ్యాల అక్రమ రవాణా,నిల్వ, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని,అనుమానాస్పద వ్యక్తులు,ప్రదేశాలు, సరఫరా మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కేసులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం లో రామగుండం కమిషనరేట్ పరిధిలో నమోదైన ఎన్ డి పి ఎస్ కేసుల పురోగతి,పెండింగ్ కేసులు,దర్యాప్తు స్థితిగతులు, నిందితుల కార్యకలాపాలు, గంజాయి సరఫరా మార్గాలు తదితర అంశాలను ఎస్పీ గిరిధర్ సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి విక్రయించేవ్యక్తులను మాత్రమే గుర్తించి కేసులు నమోదు చేయడం కాకుండా, వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది,ఎవరు సరఫరా చేస్తున్నారు,ఏ మార్గాల్లో రవాణా చేస్తున్నారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. గంజాయి,మాదకద్రవ్యాల సరఫరా గొలుసులోని ప్రతి స్థాయిని గుర్తించి,పెడ్లర్ల నుంచి ప్రధాన సరఫరాదారుల వరకు మొత్తం నెట్వర్క్ను ఛేదించే విధంగా సమన్వయంతో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు