
ఢిల్లీ , 30 అక్టోబర్ (హి.స.)
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాలకు సమీపంలో నివసించే స్థానికులకు రాయితీ ధరలకే వార్షిక లోకల్ ఫాస్టాగ్ పాస్‌లను జారీ చేసేందుకు ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం టోల్‌ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న స్థానిక ప్రజలకు మాత్రమే ఈ వార్షిక లోకల్ పాస్ సౌకర్యం లభిస్తుంది. ఈ వెసులుబాటు కేవలం కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైన వ్యక్తిగత లేదా వాణిజ్యేతర వాహనదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మున్సిపల్ లేదా పట్టణ పరిమితుల వెలుపల ఉండే టోల్‌ప్లాజాల వద్ద ఈ పాస్ ధర ఏడాదికి రూ. 1,500 కాగా, మున్సిపాలిటీ పరిధిలోని టోల్‌ప్లాజాల వద్ద ఏడాదికి రూ. 3,000 గా నిర్ణయించారు. అర్హులైన వాహనదారులు తమ వాహనం యొక్క ఆర్‌సి, క్రియాశీల ఫాస్టాగ్ మరియు నివాస ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును సమర్పించి స్థానిక టోల్‌ప్లాజాల వద్ద నేరుగా నవంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పాస్ పొందే అవకాశం కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi