
ఏక్తా నగర్ (గుజరాత్):, 31 అక్టోబర్ (హి.స.)
ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం, అక్కడ జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ మరియు సాయుధ దళాల ప్రదర్శనను ప్రధాని వీక్షించారు.
ఈ పర్యటనలో భాగంగా ఏక్తా నగర్ మరియు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 426.71 కోట్లకు పైగా విలువైన పలు పర్యాటక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' సందర్శనకు వచ్చే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు.
సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏక్తా నగర్ ఈరోజు కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా, జాతీయ ఐక్యతకు పవిత్ర కేంద్రంగా రూపాంతరం చెందిందని హర్షం వ్యక్తం చేశారు. సంస్కృతి, ఆధ్యాత్మికత, పర్యాటకం కలగలిసిన ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi