
హైదరాబాద్, 04 అక్టోబర్ (హి.స.)
ఎంఐఎం నేతలపై దాడులకు చంచల్ గూడ జైల్లో కుట్ర పన్నుతున్నారని ఇందుకోసం జైల్లో ఖైదీలతో సూపరింటెండెంట్ సమావేశం అవుతున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్లోని మీలాద్ మైదాన్లో జరిగిన 57వ 'జల్సా-ఎ-మిలాద్-ఉన్-నబి' సభలో ఒవైసీ మాట్లాడారు. లంచం తీసుకుని రౌడీషీటర్ల విడుదలకు సూపరింటెండెంట్ సహకరిస్తున్నాడని, అమాయకుల హత్యలకు పాల్పడే వారిని బహిష్కరించాలన్నారు.ఓటర్ల జాబితా ప్రత్యేక పోలింగ్ సవరణ (SIR) ప్రక్రియలో నకిలీ ఫారమ్-7 దరఖాస్తులను సమర్పిస్తూ ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఒవైసీ ఆరోపించారు. తప్పుడు ఫారమ్-7లు దాఖలు చేస్తే బాధ్యులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దరఖాస్తుదారుల వివరాలు లేకుండా ఓట్ల తొలగింపునకు ఫారాలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై ఎంఐఎం మౌనంగా కూర్చోదని, ఈ పరిస్థితి ఆగకపోతే ఢిల్లీలోని జంతర్మంతర్ నిరసనల కంటే భారీగా హైదరాబాద్ రోడ్లు, వీధుల్లో ఆందోళనలు చేపడతామని ఒవైసీ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు