
న్యూఢిల్లీ, 04 అక్టోబర్ (హి.స.)
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం జరిగిన నిరసన సమయంలో పోలీసు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ లేకపోవడాన్ని ప్రశ్నించినందుకు ఏసీపీ వివేక్ భగత్ తమను అసభ్యంగా తాకుతూ వెనక్కి నెట్టేశారని మహిళా జర్నలిస్టులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో మహిళా జర్నలిస్టుల ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ కోసం ఈ ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్ అధికారులకు బదిలీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
ఢిల్లీ పోలీస్ శాఖ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని అందువల్ల మహిళా జర్నలిస్టులపై అనుచిత చర్యలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. ఒక మహిళా జర్నలిస్ట్ప ఏసీపీ వివేక్ భగత్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని, ఆమె ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా స్థానిక డీసీపీ సచిన్ శర్మ దానిని నిరాకరించి అధికారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..