రైతుల పంటలకు 100 శాతం కొనుగోలు చేయాలి.. కేంద్రాన్ని కోరిన చంద్రబాబు
ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలను తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
Chandrababu naidu


అమరావతి , 05 అక్టోబర్ (హి.స.)ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలను తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన సమావేశంలో ఆయన పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా ఖరీఫ్–2026లో పండే తొమ్మిది పంటలకు 100 శాతం కొనుగోలు మద్దతు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కంది, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్రలు, వేరుశెనగ వంటి పంటలకు మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ముందుగానే మార్క్ఫెడ్ ద్వారా పంట కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పీఎం–ఆశా పథకం కింద రాష్ట్రానికి అవసరమైన అనుమతులు ముందుగానే వస్తే రైతులకు మార్కెట్ భరోసా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

బుర్రిపాలెంలో సహజ వ్యవసాయం చేస్తున్న రైతు పొలాన్ని చంద్రబాబు, చౌహాన్ పరిశీలించారు. రసాయన ఆధారిత సాగులో ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితిలో, సహజ వ్యవసాయ పద్ధతులతో అదే ఖర్చును సుమారు రూ.7 వేల స్థాయికి తగ్గించగలిగినట్లు రైతు వివరించారు. బీజామృతం, జీవామృతం వంటి పద్ధతుల వినియోగం వల్ల సాగు వ్యయం తగ్గడంతో పాటు నేల ఆరోగ్యానికి కూడా ప్రయోజనం ఉంటుందని అధికారులు వివరించారు.

రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలను రసాయన రహిత వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని కేంద్ర మంత్రి కూడా ప్రశంసించారు. రైతులకు కేవలం పంట ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెట్, నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోంది.

అలాగే కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.52.164 కోట్ల నిధులను విడుదల చేయాలని, 1,130 గ్రామాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, యంత్రాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande