
అమరావతి , 05 అక్టోబర్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీవారి విలువైన ఆభరణాలు, పురాతన నగలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించి అత్యంత భద్రమైన డిజిటల్ రికార్డు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధమవుతోంది.
ప్రతి ఆభరణానికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు ఉండేలా, భవిష్యత్తులో రికార్డులను సులభంగా తనిఖీ చేయగలిగేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తిరుమల పర్యటన సందర్భంగా ఇచ్చిన సూచనల నేపథ్యంలో ఈ చర్యలు వేగం పుంజుకున్నాయి.
ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి సంబంధించిన భూములు, ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని టిటిడి డిజిటలైజ్ చేసింది. అదే విధానాన్ని ఇప్పుడు ఆభరణాలు, విలువైన వస్తువులకూ విస్తరించాలని భావిస్తోంది. మూలవిరాట్కు అలంకరించే ఆభరణాలు, ఉత్సవమూర్తులకు ఉపయోగించే నగలు, ఉప ఆలయాల్లో భద్రపరిచిన ఆభరణాలు ఇలా అన్ని వస్తువులను ఒకే డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయనున్నారు.
ప్రతి ఆభరణానికి సంబంధించిన అధిక నాణ్యత గల ఫొటోలు, వీడియోలను భద్రపరచడంతో పాటు దాత వివరాలు, విరాళంగా అందించిన తేదీ, కొలతలు, స్థూల బరువు, నికర బరువు, ఉపయోగించిన లోహం, రత్నాల వివరాలు వంటి సమాచారాన్ని నమోదు చేయాలని ప్రతిపాదించారు.
డిజిటల్ రికార్డుల్లో మార్పులు చేయకుండా అత్యంత భద్రతతో నిర్వహించేందుకు ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సంస్థ సహకారం తీసుకోవాలని టిటిడి ఆలోచిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్